రాజన్న జిల్లాలో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే పోషణ అభియాన్ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. పోషణ మాసంపై రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పోషణ మాసం షెడ్యూల్, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, మన అంగన్వాడీ - మన బాధ్యత కింద అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అత్యాధునిక వసతులు, లైట్లు, ఫ్యాన్లు, ఆర్ఓ వాటర్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు ప్రతి నెలా తప్పనిసరిగా నమోదు చేయాలని, ఆ వివరాలను అంగన్వాడీ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వారిలో సామ్, మామ్, ఎస్ యూడబ్ల్యూ (, , ) పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పిల్లల ఇంటికి అంగన్వాడి సూపర్ వైజర్లు వెళ్లి, పోషకాహారం, సంరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు. వారికి బాలామృతం, బాలామృతం ప్లస్ ఆహార పదార్థాలు అందించాలని సూచించారు.
ఎదుగుదల లోపం, ఇతర ఇబ్బందులు ఉన్న పిల్లలను డీఈఐసీ కేంద్రానికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. పోషణ లోపం, తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడంతోపాటు వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో వైద్య పరీక్షలు చేపట్టి పిల్లలు సాధారణ స్థితికి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వేడి వేడిగా అందించాలని తెలిపారు.
ఈ నెల 21వ తేదీన అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వార్డు ఆఫీసర్లు తమ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల లోపల, బయట పరిశుభ్రత పనులు చేయించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఎస్ఓ డీఎం గోపాల్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.







