రాజన్న జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను నిబంధనల ప్రకారం, సమన్వయంతో జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం డీఐపీసీ సమావేశం జరిగింది.
రాజన్న జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో, నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ (డీఐపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పరిశ్రమలు, ఇతర అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముందుగా, టీజీ ఐ పాస్, టీ ప్రైడ్ పథకాల కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్నింటికి అనుమతులు జారీ అయ్యాయి, ఏ కారణాలతో అనుమతులు నిలిచిపోయాయో ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. టీజీ ఐ పాస్ కింద 44, టీ ప్రైడ్ కింద 83 దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా జారీ చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ కుమార్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బీఎం అనిల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కిరణ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్ పీడీసీఎల్, టీజీఐఐసీ, పీసీబీ అధికారులు శ్రీనివాస్, విక్రమ్, కనకజ్యోతి, డీటీసీ పీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.







