కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతోంది. రామ్‌నగర్‌లో సోమవారం సెంట్రింగ్ కార్మికుడైన ఆరిఫ్పై కుక్కల గుంపు దాడి చేసి రెండు చేతులకు గాయపరిచింది. స్థానికులు అతడిని కాపాడారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుక్కల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
కోరుట్ల పట్టణంలోని రామ్‌నగర్‌లో సోమవారం సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కూలీపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. రెండు చేతులకు కుక్కలు కరవడంతో అతడికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు కర్రలతో కుక్కలను తరిమి, ఆరిఫ్‌ను కాపాడారు. పట్టణంలోని కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, ఓల్డ్ బస్‌స్టాండ్ ప్రాంతం, టీచర్స్ క్లబ్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోజురోజుకూ వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, వీధి కుక్కలను నియంత్రించే చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.







