రాయికల్ మండల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సెప్టెంబర్ నెల సముదాయ సమావేశం మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చర్చించారు. మండల విద్యాధికారి ఎస్. రాఘవులు ఈ వివరాలను తెలిపారు.
మొదటి విడతలో 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. మిగిలిన వారికి ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల సందర్శనలపై సమీక్ష, ఉత్తమ బోధనా పద్ధతుల భాగస్వామ్యం, మూడో తరగతి సామర్థ్యాలు, ప్రశ్నల రూపకల్పన వంటి అంశాలపై చర్చించారు.
ఆంగ్లంలో రెమిడియేషన్ పాఠ్య ప్రణాళిక అమలును ప్రదర్శన వీడియో ద్వారా వివరించారు. జిల్లా విద్యా ప్రాధాన్యతల్లో భాగంగా ఎంఎఫ్సీ పరీక్ష, అసెస్మెంట్ ట్రాకర్ వినియోగం, విషయాల వారీగా బోధనాభ్యసన సామగ్రి (టి.ఎల్.ఎమ్) తయారీపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు సూచనలు
సమావేశంలో చర్చించిన అంశాలను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని ఎంఈఓ ఎస్. రాఘవులు ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల సముదాయ పీజీహెచ్ఎం కె. శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్లు ఎ. ప్రతాప్, జి. కిరణ్ కుమార్, అకడమిక్ ప్యానెల్ సభ్యులు మరియు మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


