రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ సమస్య తీవ్రంగా మారింది. బస్టాండ్ కూల్చివేసి ఏళ్లు గడుస్తున్నా, కొత్త నిర్మాణంపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు ఎండ, వానల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా తమ కష్టాలు తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రమే అయినా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్నా, కేశంపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం చౌరస్తా సమీపంలో ఉన్న బస్టాండ్ ప్రయాణికులకు మాత్రం కనీస సౌకర్యం లేని దుస్థితి నెలకొంది. బస్టాండ్ కూల్చివేసి చాలాకాలం గడుస్తున్నా, ఇప్పటివరకు కొత్త బస్టాండ్ నిర్మాణానికి శాశ్వత పరిష్కారం కనిపించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.
ఒకప్పుడు ప్రయాణికులకు బస్సు కోసం వేచి ఉండేందుకు ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉండేది. బస్టాండ్ కూల్చివేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియక, ప్రయాణికులు ఎక్కడ నిలబడాలో తెలియక, ఎండలో నిలబడాలా లేక వానలో తడవాలా అన్నదే ప్రశ్నగా మారింది.
ఎండ, వానల్లో ప్రయాణికుల ఇక్కట్లు
కేశంపేట్ నుంచి అమనగల్, షాద్నగర్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు బస్సులపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల కోసం సరైన బస్ షెల్టర్ లేకపోవడంతో, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు నీడ కోసం ఒకచోట, వర్షం పడితే తడవకుండా మరోచోట పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు వస్తుందనే సమాచారం కోసం రోడ్డు పక్కన నిలబడి ఎదురుచూడాల్సి రావడం, బస్సు ఆగే ప్రదేశం స్పష్టంగా లేకపోవడం వంటి కారణాలతో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా మారన సమస్య
కేశంపేట్ బస్టాండ్ సమస్య నిన్న మొన్నటిది కాదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వాలు మారాయి.. ప్రజాప్రతినిధులు మారారు.. అధికారులు మారారు.. కానీ బస్టాండ్ సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు వినిపిస్తున్నా, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన ఈ కనీస సౌకర్యంపై మాత్రం స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రశ్నలు
మండల కేంద్రంలో కనీసం ఒక బస్టాండ్ కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఎందుకు ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న విషయం అధికారుల దృష్టికి రావడం లేదా బస్టాండ్ నిర్మాణానికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారు ఇంకా ఎన్నేళ్లు ఇదే పరిస్థితిలో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ బస్టాండ్ ప్రాంతంలో మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ, అక్కడ కూడా ప్రజలకు అవసరమైన కనీస వసతుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ అనేక గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. అధికారులను కలవడానికి వచ్చే ప్రజలకు సరైన వసతులు లేకపోవడం, ప్రయాణికులకు బస్టాండ్ లేకపోవడం వంటి అంశాలను కలిపి చూస్తే, మండల కేంద్రం అంటే ఇదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.


