హైదరాబాద్, జూలై 29
తెలంగాణలో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పౌరుల సౌలభ్యం కోసం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ ప్రక్రియను రెవెన్యూ శాఖ అధికారికంగా అమల్లోకి తెచ్చింది.
తెలంగాణలో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, పౌరుల సౌలభ్యం కోసం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ ప్రక్రియను అధికారికంగా అమల్లోకి తెచ్చింది.
ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డు) డేటాను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్ను తయారు చేయనుంది. ప్రతి కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డ్ నంబరే ‘ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా కొనసాగుతుంది. ఈ రిజిస్టర్లో కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో ఉన్న సంబంధం, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, ఆధార్ నంబర్ మరియు ప్రస్తుత చిరునామా వంటి సమగ్ర వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ నిర్ధారణ కోసం ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. సమాజంలోని ప్రతీ కుటుంబానికి సంబంధించిన అధికారిక వివరాలను ఒకే చోట పొందుపరిచేలా ఈ డిజిటల్ గుర్తింపు దోహదపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
కుటుంబంలోని ప్రధాన సభ్యులు ఎవరైనా సరే రాష్ట్రంలోని ‘మీసేవా’ కేంద్రాలు, అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే కేవలం 2 రెండు పని దినాల్లో ఈ సర్టిఫికెట్ను జారీ చేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణకు, సంక్షేమ పథకాల లబ్దికి ఉపయోగపడుతుందని, అయితే ఇది ఆస్తులపై ఎటువంటి చట్టపరమైన హక్కులను, టైటిల్ను లేదా చట్టపరమైన వారసత్వాన్ని నిర్ధారించదని ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.









