వినాయక నిమజ్జన విధుల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్, ఆయన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్, ఆయన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న పోలీస్ వాహనాన్ని అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం నుజ్జునుజ్జయింది.
ప్రమాదంలో ఎస్సై జగదీష్‌తో పాటు డ్రైవర్ రాకేష్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాకరవాయి గ్రామానికి చెందిన డ్రైవర్ రాకేష్ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలు, గాయాల తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.







