తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో జగిత్యాల నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో మంజూరైన ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేటాయించిన కోటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
అలాగే, మొదటి విడతలో జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని కూడా సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
హౌసింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్, ఎంపీడీవోలు రమాదేవి, చిరంజీవి, వాసవి, భీమేష్, నీరజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.












