మండల కేంద్రమైన కేశంపేట్లో ప్రయాణికుల కోసం బస్టాండ్ లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కేశంపేట్ మండల కేంద్రంలో ప్రయాణికుల కోసం సరైన బస్టాండ్ లేకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా పరిష్కారం మాత్రం కనిపించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బస్సు కోసం వచ్చే ప్రయాణికులకు నిలబడేందుకు సరైన స్థలం లేదు, కూర్చోవడానికి బెంచీలు లేవు, ఎండకు నీడ లేదు, వర్షం వస్తే తలదాచుకునే షెడ్డు లేదు. దీంతో ప్రయాణికులు విగ్రహాల నీడను, మండల కార్యాలయాల పరిసరాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మండల కేంద్రానికే అవమానం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుల ఇక్కట్లు
కేశంపేట్ నుంచి షాద్నగర్, ఆమనగల్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్కసారిగా బస్సు వస్తే ప్రయాణికులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. మండల కేంద్రంలోనే ప్రయాణికులకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది.
నిర్మాణంపై ప్రశ్నలు
ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా కేశంపేట్ బస్టాండ్ నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అసలు బస్టాండ్ నిర్మాణానికి నిధులు లేవా స్థలం సమస్యగా మారిందా స్థలం ఉంటే ప్రతిపాదనలు ఎందుకు చేయడం లేదు ప్రతిపాదనలు ఉంటే పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదు నిధులు మంజూరైతే నిర్మాణం ఎందుకు పూర్తి కావడం లేదు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ప్రయాణికులు రోడ్డుపక్కన నిలబడటం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కంటే, ప్రమాదం జరగకముందే బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా, ప్రజల కోసం ఒక సరైన ప్రయాణికుల బస్టాండ్ లేకపోవడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారా లేక మరో ప్రభుత్వం వచ్చే వరకు కేశంపేట్ ప్రజలు రోడ్డుపైనే బస్సుల కోసం నిలబడాల్సిందేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.












