జర్నలిస్టులపై పోలీసుల వేధింపులకు నిరసనగా, గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్‌ను విధుల నుంచి తొలగించి, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విషారదన్ మహారాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్, బాధిత దళిత, బీసీ జర్నలిస్టులైన శేఖర్, సంపత్‌లను అత్యంత క్రూరంగా కొట్టి, హింసకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, విధుల నుంచి బహిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజు డిమాండ్ చేశారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ మద్దతు
ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఆమె పిలుపుమేరకు, రాజన్న జిల్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.











