పశ్చిమ బెంగాల్లో తొక్కిసలాట, మధ్యప్రదేశ్‌లో ట్రక్కు ప్రమాదం, హైదరాబాద్‌లో దాండియా వేడుకల్లో విద్యార్థిని బలికావడం వంటి ఘటనలు యాదృచ్ఛిక దుర్ఘటనలు కావని, ఇవి దేశంలో ప్రజా భద్రతా వ్యవస్థలు కుప్పకూలిపోవడానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేడుకలు, పండుగల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో అధికార యంత్రాంగం, నిర్వాహకులు చూపుతున్న అలసత్వానికి ఇవి స్పష్టమైన రుజువులు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన తొక్కిసలాట సంఘటనలో సరైన వెలుతురు లేని ఇరుకైన ప్రదేశంలో, కుండపోత వర్షం మధ్య భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొని క్షణాల వ్యవధిలోనే పందొమ్మిది విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ప్రజా ఈవెంట్లను వ్యాపారాత్మక దృక్పథంతో నిర్వహిస్తున్నప్పుడు పరిమితికి మించి పాస్‌లు, టిక్కెట్లు విక్రయించడం, అందుకు తగ్గ పోలీస్ భద్రత, అంబులెన్స్ సదుపాయాలు కల్పించకపోవడం యథేచ్ఛగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు లేకుండా కేవలం కాగితాలపైనే అనుమతులివ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ కళాశాల దాండియా వేడుకలో విద్యుత్, వేదిక భద్రతా ఆడిటింగ్ సరిగా లేకపోవడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో విద్యార్థిని బలికావాల్సి వచ్చింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో విచక్షణారహితంగా జనం మీదికి ట్రక్కు దూసుకెళ్లడం అనేది రవాణా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను, రహదారి భద్రతపై అధికారుల అలసత్వాన్ని బహిర్గతం చేస్తోంది. పరిమితికి మించిన వేగం, తాగి వాహనాలు నడపడం, సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం ఇటువంటి ఘోరాలకు దారితీస్తోంది.
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని యంత్రాంగం
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వాల ఉదాసీనత వల్ల దేశంలో ఏదో ఒక మూల నిత్యం రోడ్లు రక్తసిక్తం అవుతూనే ఉన్నాయి. ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నప్పుడు దర్యాప్తుల పేరుతో కాలయాపన చేయడం, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గతంలో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో తొక్కిసలాట, మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ మాతా ఆలయం వద్ద వంతెన కూలిపోతోందన్న వదంతుతో భయభ్రాంతులైన భక్తులు తీసిన పరుగులో వందలాది ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు విచారణ కమిటీలను వేయడం, ప్రకటనలు గుప్పించడం, తరవాత విస్మరించడం పాలకులకు అలవాటుగా మారింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలోనూ, సరైన రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం విఫలమవుతుండటం వల్లే ఇలాంటి దుర్ఘటనలు పరిపాటిగా మారుతున్నాయి.
ఈ వరుస ప్రమాదాల వెనుక ప్రజాక్షేమం కంటే లాభాలకు, ప్రచారానికే ప్రాధాన్యమిచ్చే పెట్టుబడిదారీ ధోరణి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి, ప్రయివేట్ నిర్వాహకులకు విచ్చలవిడిగా రాయితీలు ఇస్తూ నియంత్రణ చర్యలను నీరుగారుస్తున్నాయి. విఐపి సంస్కృతికి రాచబాటలు పరిచే ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం, గంటల తరబడి ఎండలో, ఇరుకు సందుల్లో నలిగిపోయే సామాన్యుల ఉసురు తీస్తున్నది. అదొక నేరపూరిత ఉదాసీనత.
కఠిన చట్టాలు, పక్కా ప్రణాళికతోనే పరిష్కారం












