జగిత్యాల, 12 November
పట్టణానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన 57 లక్షల రూపాయల విలువైన చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు.
పట్టణానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన 57 లక్షల రూపాయల విలువైన చెక్కులను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.
మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని చింతకుంట చెరువు, మోతె చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో చెరువుకు రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఏడాది క్రితమే నిధులు మంజూరైనప్పటికీ వర్షాలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పనుల ప్రారంభంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు.
నియోజకవర్గ, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. కొందరు నాయకులు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పునరుజ్జీవన పనులు ప్రారంభం కానున్నాయని తెలిసి, పనులు ఇంకా ప్రారంభించలేదంటూ విమర్శలు చేయడం, తాము ప్రశ్నించడం వల్లే పనులు జరుగుతున్నాయని భావించడం వారి అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
చెరువుల పునరుజ్జీవన పథకంలో 67 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 33 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తోందని ఆయన అన్నారు.
నియోజకవర్గానికి నూతన పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అవసరమైన నూతన పథకాలను కూడా ప్రజాప్రభుత్వం అందిస్తోందని, మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఎంఆర్ఓ రామ్మోహన్, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, అడువాల లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ దుమాల రాజ్ కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు బీరం రాజేష్, డీసీసీ ఉపాధ్యక్షులు రవీందర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







