జగిత్యాల, 14 November
పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 95 వాహనాలను గుర్తించి, వాటిపై జరిమానాలు విధించారు. వాహన యజమానులకు అవగాహన కల్పించి, నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీ పురుషోత్తం రెడ్డి సూచనల ప్రకారం, పట్టణ సీఐ శ్రీ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, సిబ్బందితో కలిసి పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను, మోటార్ వాహనాల చట్ట నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలను గుర్తించి, మొత్తం 95 వాహనాలను అదుపులోకి తీసుకుని, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహన యజమానులకు సరైన, ప్రామాణిక నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించి, కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల సూచనల మేరకు వాహన యజమానులు స్వచ్ఛందంగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపులా నిబంధనలకు అనుగుణంగా కొత్త నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పట్టణ సీఐ శ్రీ పి. కరుణాకర్ మాట్లాడుతూ, ప్రతి వాహనానికి తప్పనిసరిగా నిబంధనల ప్రకారం నిర్దేశించిన ప్రామాణిక నంబర్ ప్లేట్లు ఉండాలని, నంబర్ ప్లేట్లు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






