ముస్తాబాద్, 16 November
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే, రైతులకు దక్కాల్సిన బోనస్ రూ. 5 కోట్లు దళారులు కొల్లగొట్టారని అధికారులకు ఫిర్యాదు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో తక్షణమే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతికుమార్ అధ్యక్షతన డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు అందాల్సిన ప్రభుత్వం ప్రకటించిన బోనస్ రూ.500 చొప్పున, లక్ష క్వింటళ్ల ధాన్యం దళారులకు ముందుగానే అమ్ముడుపోయిందని,ఈ దళారులు రైతులకు రావాల్సిన బోనస్ రూ. 5 కోట్లు రైతులకు దక్కకుండా చేశారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ తరఫున ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చేయకుండా, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని, ఒకవేళ కొనుగోళ్లు ప్రారంభించకుంటే రైతులతో కలిసి పోరు బాట పడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల సత్యం రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మీస స్వామి, గూడెం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రావు, మండల ఉపాధ్యక్షులు చికోటి మహేష్, శక్తి కేంద్రం ఇంచార్జి కటకం మహేష్, వార్డు మెంబర్ మర్గల వేణుగోపాల్, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


