కమలాపురం
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య హక్కులకు సంకెళ్లు వేస్తున్నాయా అనే ప్రశ్నలు ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఉత్పన్నమవుతున్నాయి, ఇక్కడ 791 పంచాయతీలకు గాను 250కి పైగా ఏకగ్రీవం అయ్యాయి.
గ్రామ స్వరాజ్యానికి పునాది కావాల్సిన పంచాయతీ ఎన్నికలు రాజకీయ ఆధిపత్యానికి వేదికలుగా మారుతున్నాయా ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య హక్కులకు సంకెళ్లు పడుతున్నాయా అన్న ప్రశ్నలు గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 791 గ్రామ పంచాయతీలకు జరిగిన 2021 ఎన్నికల్లో 250కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కావడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నాలుగో విడతలో 224 పంచాయతీలకు గాను 108 ఏకగ్రీవం కావడం, దాదాపు 48 శాతం స్థానాల్లో పోటీ లేకపోవడం గమనార్హం. ఏకగ్రీవాల వెనుక గ్రామాల మధ్య సామరస్యమా లేక రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, నామినేషన్ల ఉపసంహరణకు తెరవెనుక ప్రయత్నాలా అన్న అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. ఏకగ్రీవం అనేది స్వచ్ఛందంగా ప్రజలు తీసుకున్న నిర్ణయమైతే స్వాగతించాల్సిందే. కానీ పోటీ చేయాలనుకునే అభ్యర్థులను అడ్డుకుని, ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తే మాత్రం అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. నజరానాల ప్రకటనలు సరే. నిధుల లెక్కలేవి గతంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహక నిధులు ఎంతమేర విడుదలయ్యాయి వాటితో ఎన్ని గ్రామాల్లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. నిధుల వినియోగంపై సామాజిక తనిఖీ నిర్వహించి, గ్రామాలవారీగా ఖర్చుల వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన అనంతరం వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని 619 పంచాయతీల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ, ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలను రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంచినట్లు ప్రకటించడం కొత్త చర్చకు దారితీస్తోంది. గతంలో ప్రకటించిన నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయకుండా కొత్త ప్రోత్సాహకాలతో ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏకగ్రీవం పేరుతో ఓటు హక్కును ప్రభావితం చేసే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. గ్రామాభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించడం మంచిదే అయినా, ప్రజాస్వామ్య పోటీని బలహీనపరిచే విధంగా అవి మారకూడదు. ఏకగ్రీవం స్వచ్ఛందంగా రావాలి.. బలవంతంగా కాదు. నజరానాల లెక్కలు పారదర్శకంగా ఉండాలి.. ప్రజాధనానికి జవాబుదారీతనం ఉండాలి.
తొలి విడత (206 పంచాయతీలకు గాను 46 ఏకగ్రీవాలు): బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లో అట్లూరు, గోపవరం, బి.కోడూరు, కాశినాయన, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, దువ్వూరు మండలాల్లోని పలు చిన్న, మధ్యతరహా గ్రామ పంచాయతీలు పోటీ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. రెండో విడత (175 పంచాయతీలకు గాను 50కి పైగా ఏకగ్రీవాలు): , రాయచోటి, వల్లూరు, చెన్నూరు, పెండ్లిమర్రి మండలాల్లో అధికార పక్షం వ్యూహంతో దాదాపు 50కి పైగా స్థానాల్లో పోటీ లేకుండా చేశారు. ముఖ్యంగా మండలంలోని అప్పారావుపల్లె, సంబటూరు, గోపవరం, విభరాంపురం, కోకటం, నిడిజువ్వి, తప్పెట్ల, తురకపల్లె, నందిమండలం సహా 22 పంచాయతీలు ఏకగ్రీవ జాబితాలోకి చేరాయి. రాయచోటి ప్రాంతంలోని లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం, గాలివీడు మండలాల్లోనూ పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత (186 పంచాయతీలకు గాను 45కు పైగా ఏకగ్రీవాలు): రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రైల్వేకోడూరు ప్రాంతాల్లోనూ అధికార బలంతో దాదాపు 45కు పైగా పంచాయతీలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకున్నారు. నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన ప్రతిపక్ష అభ్యర్థులను సైతం వెనక్కి తగ్గేలా చేసి ఏకపక్ష విజయాలు సాధించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

