పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా పరిమిత వైమానిక దాడులు చేపట్టింది. హోర్ముజ్ జలసంధిలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖేష్మ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా అధికారులు వీటిని రక్షణాత్మక చర్యలుగా అభివర్ణించారు.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ కథనం ప్రకారం, ఖేష్మ్ ద్వీపంలో వరుసగా ఐదు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో రెండు విమానాలు కనిపించినట్లు కొందరు స్థానికులు తెలిపారని పేర్కొంది. అయితే పేలుళ్లకు కారణం ఏమిటన్నది తొలుత స్పష్టంగా తెలియలేదు.
అమెరికా అధికారులు మాత్రం, తమ ఆస్తులకు ఇరాన్ బలగాలు ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణుల ద్వారా ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ నుంచి అమెరికా విమానంపై దాడి జరిగినందుకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని మరో అధికారి తెలిపారు.
రహస్య దాడుల వెనుక కారణాలు
అమెరికా సైన్యం ఇటీవలి వారాల్లో ఇరాన్‌పై చిన్న స్థాయిలో పరిమిత దాడులు చేపడుతున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఈ చర్యలను బహిరంగంగా ప్రకటించకపోవడానికి కారణం.. పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయనే సంకేతాలు వెళ్లకుండా చూడటమేనని అమెరికా అధికారులను ఉటంకించింది. అయితే, ఈ దాడులు పూర్తిస్థాయి యుద్ధం పునఃప్రారంభానికి సంకేతం కాదని అధికారులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ఘటనపై వెంటనే అధికారిక ప్రకటన చేయలేదు.
హోర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత
ఖేష్మ్ ద్వీపం హోర్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారం వద్ద ఉంది. ప్రపంచ చమురు రవాణాకు ఈ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడి నుంచి నౌకల రాకపోకలను నియంత్రించే సామర్థ్యం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. వాణిజ్య నౌకలపై దాడులు, జలసంధిలో రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌పైనా ప్రభావం పడుతోంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో పురోగతి కనిపిస్తోందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తెలిపారు. అయితే తాజా దాడుల నేపథ్యంలో చర్చలు ఏ దిశగా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.












