మధిర మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 53కు చెందిన ప్రభుత్వ పెద్ద బీడు భూముల్లో మట్టి మాఫియా అక్రమ దందాకు తెరలేపిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు స్వార్థపరులు ప్రభుత్వ భూములను వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నారని, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ తవ్వకాలకు సన్నాహాలు
ప్రభుత్వానికి చెందిన ఈ స్థలంలో దాదాపు 20 నుంచి 30 అడుగుల మేర లోతుగా మట్టి/గ్రావెల్ తవ్వకాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాంతం మధిర మున్సిపాలిటీ రెండో వార్డుకు సమీపంలో ఉండి, తరచుగా వరద ముంపునకు గురవుతోందని స్థానికులు తెలిపారు. ఇలా 20-30 అడుగుల లోతులో మట్టిని జేసీబీలతో తీయడం వల్ల భవిష్యత్తులో ఆ ప్రాంతం మరింత లోతట్టుగా మారి, మధిర మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
భూముల అమ్మకంపై తీవ్ర ఆరోపణలు
ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు, ఆ భూములను సాగు చేయకుండా ఎకరాకు సుమారు రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు రేటు కుదుర్చుకుని మట్టిని బహిరంగంగా అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను కేవలం వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉండగా, మట్టిని తవ్వి వ్యాపారం చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవని, అయినప్పటికీ యథేచ్ఛగా భూగర్భాన్ని తవ్వేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
అధికారులకు విజ్ఞప్తి
ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ అక్రమంగా కోట్లాది రూపాయలు గడిస్తున్న వారిపై రెవెన్యూ, మున్సిపల్, మైనింగ్ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.












