మధిర, 2026-08-29
మధిర పట్టణంలోని చారిత్రాత్మక జమియా మసీదు (మర్కజ్) ఆవరణలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన షాదీఖానా నిర్మించాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఐక్య సంఘం అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి నేతృత్వంలో ప్రతినిధుల బృందం మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాతను కలసి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర కలిగిన జమియా మసీదుకు మధిర పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. అయితే, మసీదులో నమాజుకు ముందు వజూ చేసుకోవడానికి, అలాగే మరుగుదొడ్ల వసతి సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే పట్టణంలో ముస్లిం జనాభా పెరిగినందున, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాదీఖానా ఎంతమాత్రం సరిపోవడం లేదన్నారు. ఫలితంగా, వివాహాలు, శుభకార్యాల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదు ప్రాంగణంలో మరుగుదొడ్లు, వజూ సౌకర్యం అందుబాటులోకి తెచ్చి, ఆధునిక వసతులతో కొత్త షాదీఖానా నిర్మిస్తే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపై మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య తీవ్రతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వారి సహకారంతో త్వరితగతిన నూతన షాదీఖానా నిర్మాణం, మసీదులో వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు సయ్యద్ రసీదు, ఎస్.కె.బాజీ, గౌస్ ఉద్దీన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.