పుట్టపర్తి, 19 November
నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, నాయకులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, దివంగత స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిరి వెంక రెడ్డి అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్స్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఇందిరా గాంధీ దేశానికి చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా దేశ సమగ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలనకు శ్రీకారం చుట్టారని, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం బ్యాంకుల జాతీయీకరణ చేశారని అన్నారు. ఆహార కొరతను తీర్చడానికి హరిత విప్లవాన్ని ప్రోత్సహించి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. భూసంస్కరణల చట్టం ద్వారా పేదలకు భూములు పంపిణీ చేశారని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే కాకుండా, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని అన్నారు.
నేటి తరం నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దున్నా శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎలుగూరి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జూలూరు వీరాచారి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు శ్రీరాముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చిల్లంచర్ల సత్యనారాయణ, వార్డు సభ్యులు దున్న లింగయ్య, బాణాల సతీష్ కుమార్, కాసాని మాధవి గోపీనాథ్, షేక్ నాజియా రియాజ్, యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పల్లపు గోపాల్, సెల్ షాపూర్ కిషోర్, గుంజ శ్రీకాంత్, కిషోర్, సైదులు, రవి, శ్రీరాముల వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



