భూపాలపల్లి, జూలై 8
భూపాలపల్లిలో సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారం కోరుతూ CMOAI ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు యాజమాన్యాన్ని కోరారు.
భూపాలపల్లి ఏరియా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (CMOAI) ఆధ్వర్యంలో సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మరియు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి న్యాయమైన డిమాండ్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటం విచారకరమన్నారు. అధికారులకు రావాల్సిన PRP (Performance Related Pay) బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు, వేజ్ రివిజన్‌ను తక్షణమే అమలు చేయాలని, జీతాల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అధికారుల ఉద్యమం పూర్తిగా న్యాయబద్ధమైనదని, వారి హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారంలో కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరారు. అధికారుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పూర్తి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్న అధికారులను పరామర్శించి, వారి డిమాండ్లు త్వరితగతిన పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుజేందర్, రాష్ట్ర నాయకులు బట్టు రవి, జిల్లా ఉపాధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, నాయకులు రామ్ రెడ్డి, శ్రీనివాస్, కొమరన్న, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






