జగిత్యాల, 7 September
జిల్లాలో నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ వారికి స్టార్ చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన మల్లారెడ్డి, మునియ్య, ఎం.డి. నసీర్ ఖాన్, మహమ్మద్ ఇలియాస్ అహ్మద్‌లు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ, పదోన్నతి పొందిన నలుగురు పోలీస్ సిబ్బందికి ఏఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాలను అలంకరించి, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడమే కాకుండా, బాధ్యతలు కూడా మరింత పెరగడానికి సూచిక అని అన్నారు.
పెరిగిన బాధ్యతలను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం, గౌరవం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.











