మధిర, 2026-06-05
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో, స్వర్ణ బార్ పక్కన ఉన్న రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని మాజీ కౌన్సిలర్ ఇక్బాల్, 9వ వార్డు పార్టీ ఇన్చార్జి ఆళ్ల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్‌డ్రైనేజీ, ఇతర నిర్మాణ పనుల పేరుతో రహదారులను తవ్వి వదిలేయడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో, స్వర్ణ బార్ పక్కన ఉన్న రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని మాజీ కౌన్సిలర్ ఇక్బాల్, 9వ వార్డు పార్టీ ఇన్చార్జి ఆళ్ల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్‌డ్రైనేజీ, ఇతర నిర్మాణ పనుల పేరుతో రహదారులను తవ్వి వదిలేయడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాము పరిశీలించిన స్వర్ణ బార్ పక్కన ఉన్న రహదారి దుస్థితికి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
రెండేళ్లుగా అండర్‌డ్రైనేజీ పనులు కొనసాగుతున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయి, ప్రజలకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు విముక్తి కల్పిస్తారు అని నిలదీశారు.
2వ వార్డు కౌన్సిలర్ రమణ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ శామ్యూల్ ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోలేకపోతే పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారు, చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి అని వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మధిర మున్సిపాలిటీలో ఈ నిర్మాణ పనుల కారణంగా ఎక్కడైనా ఎవరైనా కిందపడి ప్రమాదానికి గురైతే, లేదా దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరిది అని వారు ప్రశ్నించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరంగా ఉన్న రహదారుల వద్ద వెంటనే రక్షణ చర్యలు చేపట్టి, తవ్విన ప్రాంతాలను సురక్షితంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
అండర్‌డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ కరెంట్ పనులు పూర్తయ్యే వరకు మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వసూళ్లపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా పన్నులు మాత్రం ఎలా వసూలు చేస్తారు అని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మధిరను అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ అభివృద్ధి పనుల పేరుతో ప్రజలు ఇంతకాలం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం అని అన్నారు. పనుల్లో జాప్యం, నాణ్యత, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో భట్టి విక్రమార్క గారి క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తాం అని మాజీ కౌన్సిలర్ ఇక్బాల్, 9వ వార్డు పార్టీ ఇన్చార్జి మీడియాకు తెలిపారు.












