Suryapet/Nadigudem (ధర్మ రథం) అక్టోబర్ 13
కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.52.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిల ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి.
కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.52.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిల ప్రత్యేక చొరవ, కృషితో నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేశాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మంగళవారం జీవో ఆర్టీ నంబర్ 533ను జారీ చేసింది. 202627 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ ఎండీఆర్ నిధుల కింద మొత్తం రూ.52.50 కోట్లతో నాలుగు రహదారుల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాత జాతీయ రహదారి9 నుంచి కొండాపురం వరకు 12.2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, పటిష్టీకరణకు రూ.27 కోట్లు, బేతవోలు నుంచి ఆచార్యులగూడెం వరకు 5.6 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. అదేవిధంగా పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం రోడ్డు వరకు 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.4.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామలక్ష్మీపురం వరకు 3.1 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి రూ.7.50 కోట్లు మంజూరు చేశారు.
ఈ నాలుగు రహదారుల అభివృద్ధి పనులతో ఆయా గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లేందుకు, ప్రజలు వైద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా మారనున్నాయి. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రభుత్వ స్థాయిలో కృషి చేశారు. మంజూరైన రహదారి పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కోదాడ నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్ల నిధులు మంజూరు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












