Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 30
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున, మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సెలవులపై వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అన్ని జిల్లాలలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, రహదారుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పడిపోయే అవకాశం ఉన్న గృహాలు, భవనాలను గుర్తించి, అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, ఓఆర్ఎస్ పాకెట్లు, పాము, తేలుకాటు వంటి వాటికి మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలలో ప్రజలకు సహకరించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాల్సిన అవసరం ఉందని, దీనికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల అధికారులు కార్యస్థానాలు వదిలి వద్దని, ఎవరు సెలవుపై వెళ్లరాదని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో సమాచారం అందించేందుకు ఫోన్ నెంబర్ 1800 425 1442 ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ ఆర్. దశరథ, సిపిఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి. శేఖర్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.










