హనుమకొండ, 2026-08-10
రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందులున్నా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండలో నిర్వహించిన జిల్లాస్థాయి రైతు మేళాను ఆయన ప్రారంభించారు.
రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లాస్థాయి రైతు మేళాను మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రభుత్వ నిబద్ధత
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లుగా అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.5,250 కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తోందని, ఇది రైతు సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు, మౌలిక వసతులు
యాసంగి సీజన్లో రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందించిందని, ధాన్యం కొనుగోలు సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైన విషయం వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. గతంలో తగిన గోదాముల నిర్మాణం, ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదాముల సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసిందని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని, రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం ఇదేనని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులు, భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. భూభారతి విధానం ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, టైటిల్, భూ రికార్డులు, మ్యాప్ తదితర వివరాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులు, భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అందించి సమగ్ర భూ సర్వేకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో భూ రికార్డులను క్రమబద్ధీకరించి భవిష్యత్తులో భూ వివాదాలు, ఆక్రమణలు, హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, రాష్ట్రంలోని భూముల యజమానులు సంతృప్తిగా ఉండటమే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వానికి నిజమైన ఆనందమని మంత్రి పేర్కొన్నారు.











