సత్తుపల్లి, 2026-06-05
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని అత్తను అల్లుడు, అతని ప్రియురాలు కలిసి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని అత్తను అల్లుడు, అతని ప్రియురాలు కలిసి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదివారం మీడియాకు వైరా ఏసీపీ, కల్లూరు ఇన్ఛార్జ్ సారంగపాణి వివరాలు వెల్లడించారు.
కేసు వివరాలు
తుంబూరు గ్రామానికి చెందిన వెదుళ్ల తిరుపతి రావుకు అదే ఊరికి చెందిన పగుట్ల సునీతతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తిరుపతి రావు భార్య మంగమ్మతో పాటు ఆమె తల్లి గుండాల వెంకట నర్సమ్మ (65)కు తెలియడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జులై 30న సునీత పనిచేస్తున్న చోటుకు వెళ్లి వెంకట నర్సమ్మ, మంగమ్మలు ఆమెను నిలదీసి తిట్టి కొట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తమ బంధానికి అడ్డుగా ఉన్న వెంకట నర్సమ్మను అంతమొందించాలని తిరుపతి రావు, సునీతలు పథకం పన్నారు.
దారుణ హత్య
ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న వెంకట నర్సమ్మ మెడకు చీర కొంగు బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై నారాయణపురం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఎండుకట్టెలు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. శవం పూర్తిగా కాలకపోవడంతో మరుసటి రోజు మళ్లీ వచ్చి నిప్పు పెట్టారు. ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలను మరోచోటుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి పూర్తిగా కాల్చివేసే యత్నం చేశారు.
నిందితుల అరెస్ట్
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నారాయణపురం-గురుభట్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద నమ్మదగిన సమాచారంతో నిందితులు వెదుళ్ల తిరుపతి రావు, పగుట్ల సునీతలను పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన బైక్, రెండు సెల్ఫోన్లు, మృతురాలి పగిలిన ఫోన్, ఖాళీ పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
పోలీసుల ప్రతిభ
ఈ కేసు దర్యాప్తును సత్తుపల్లి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.శ్రీహరి నిర్వహించారు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడంలో వైరా ఏసీపీ / కల్లూరు ఇన్ఛార్జ్ సారంగపాణి, ఇద్దరు ఎస్ఐలు మరియు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రతిభ కనబరిచారని ఏసీపీ వెల్లడించారు.











