రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో వరంగల్, నల్లగొండ, జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఓటర్ల నమోదు, ఎన్నికల వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆరు జిల్లాల నేతలతో దశలవారీగా సమావేశమవుతున్న ఆయన.. ఇందులో భాగంగా వరంగల్, నల్లగొండ, జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. నమోదుకు సంబంధించి పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లను మోసం చేసిందన్న ఆగ్రహం వారిలో తీవ్రంగా ఉందని కేటీఆర్ అన్నారు. చదువుకున్నవారు తమ సమస్యలతోపాటు తమ కుటుంబాలు, రైతులు, మహిళలు, యువత సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని అన్నారు. అయితే ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటుగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మరో రెండు రోజుల్లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయి ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా బాధ్యతలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, , నల్లగొండ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈసారి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అభ్యర్థి ఎవరైనా ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






