జగిత్యాల, Jagtial, Telangana (ధర్మ రథం) అక్టోబర్ 06
జగిత్యాల పట్టణంలో సోమవారం మున్సిపల్ అధికారుల బృందం పలు రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు గుర్తించిన మూడు రెస్టారెంట్లకు మొత్తం రూ.25,000 జరిమానా విధించారు.
జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బృందం సోమవారం పలు రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులను అధికారులు పరిశీలించారు. తనిఖీలలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించిన పి ఎం ఆర్, మండి, కింగ్స్ మండి రెస్టారెంట్లపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుని మొత్తం రూ.25,000 వరకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం నిర్వాహకుల బాధ్యత అని పేర్కొన్నారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయడంతో పాటు, కుళ్లిపోయిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగించరాదని హెచ్చరించారు.
పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే హోటళ్లు, రెస్టారెంట్లపై మున్సిపల్ శాఖ తరఫున ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాము, చందు, జవాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












