శాయంపేట మండలంలోని తహరాపూర్ నుండి శాయంపేట వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మండలంలోని తహరాపూర్ నుండి శాయంపేట వెళ్లే ప్రధాన రహదారి చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీని కారణంగా వాహనదారులు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతల వల్ల శాయంపేట నుండి తహరాపూర్ వైపు వచ్చే వాహనాలు అకస్మాత్తుగా కుడి వైపునకు మళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలతో ఢీకొనే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై ప్రయాణించడం దుర్భరంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.












