కేశంపేట్ కేశంపేట్ మండలం, వేములనర్వ రహదారి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రహదారిపై ఏర్పడిన గుంతలు, అధ్వాన్నమైన పరిస్థితితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూటే ఈ పరిస్థితి ఉంటే.. రాత్రివేళ ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రహదారిపై ఒకవైపు వెళ్లే వాహనాలు ఎలాగోలా ప్రయాణిస్తున్నప్పటికీ, ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పెద్ద వాహనం ఎదురుగా వచ్చినప్పుడు, ద్విచక్ర వాహనదారులు పక్కకు తప్పించుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.
గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని, ఎదురెదురుగా వచ్చే వాహనాల మధ్య ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ వెలుతురు తక్కువగా ఉండటంతో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే అధికారులు స్పందించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారిని పరిశీలించి గుంతలను పూడ్చి, రహదారిని సురక్షితంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారా లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.












