Suryapet/Nadigudem (ధర్మ రథం) అక్టోబర్ 02
తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో పథకం అందించిన భరోసాను గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
మన బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి రోజులను మరోసారి స్మరించుకుందాం అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామగా నిలిచి, కళ్యాణ లక్ష్మి పథకంతో కొండంత భరోసా కల్పించిన ప్రజా నాయకుడు మన కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ చారిత్రాత్మక మహత్కార్యంలో తాను కూడా ఒక భాగస్వామిని కావడం తన పూర్వజన్మ సుకృతం అని తెలిపారు.
నేను కోదాడ శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో వేలాది మంది ఆడబిడ్డల ఇళ్లకు స్వయంగా వెళ్లి, ఒక అన్నలా వారి చేతుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించినప్పుడు ఆ చెల్లెమ్మలు, వారి కుటుంబ పెద్దల ముఖాల్లో కనిపించిన ఆనంద బాష్పాలను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటికీ భావోద్వేగభరితంగా నిలిచిపోతాయని ఆయన అన్నారు.
కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మనసు వికలమవుతోందని మల్లయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనను కలుస్తున్న చెల్లెమ్మలు ఎంతో బాధతో తమ ఆవేదనను పంచుకుంటున్నారని తెలిపారు. అన్నా... ఆరోజు కేసీఆర్ గారి హయాంలోనే చాలా బాగుండేది. ఆడబిడ్డ పెళ్లి భారమవ్వకూడదని మేనమామలా పెద్ద సాయం చేశారు. కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని నమ్మించి, ఓట్లు వేయించుకుని మోసం చేసింది. పాత పద్ధతిలోనైనా కళ్యాణ లక్ష్మి డబ్బులు సకాలంలో ఇస్తున్నారా అంటే అదీ లేదు... అంటూ ఎంతోమంది కన్నీటి పర్యంతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కూతురి పెళ్లి కోసం మళ్లీ అప్పులు చేస్తూ ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాల బాధ నిజంగా వర్ణనాతీతం అని మల్లయ్య యాదవ్ అన్నారు. తాను వారికి ఒక్కటే స్పష్టంగా చెప్పానని, ఎవరూ భయపడకండి, అధైర్యపడకండి. ఆడబిడ్డల కష్టాలు తెలిసిన తండ్రిలాంటి కేసీఆర్ గారిని, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం. మన కష్టాలు తీరే రోజులు మళ్లీ వస్తాయని వారికి నమ్మకాన్ని ఇచ్చానని తెలిపారు.











