రష్యాఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాధిత కుటుంబానికి అందజేశారు.
సుదర్శన్ గౌడ్ కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చొరవ తీసుకుని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఉపాధి నిమిత్తం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్, అక్కడ కొనసాగుతున్న యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుదర్శన్ గౌడ్ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మరోవైపు, ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి అనారోగ్యానికి గురై కాళ్లు, చేతులు కోల్పోయిన అబ్బాడి శ్రీనివాస్‌ను పరామర్శించి, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజంగి నందయ్య, జిల్లా మండల నాయకులు, సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












