మునగాల, 2026-11-22
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తలకు మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి సత్వర సహాయం అందించారు. అంబులెన్స్ రాకముందే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన, క్షతగాత్రులను తన పోలీసు వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి కోదాడ వైపు స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలు, రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని తప్పించబోయే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపే స్పందించిన పోలీసులు, గాయపడిన భార్యాభర్తలను తమ పోలీసు వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
స్థానికుల ప్రశంసలు
ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందిస్తూ, వారి ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిస్తున్న మునగాల పోలీసుల సేవా తీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల రక్షణే లక్ష్యం.. ఆపదలో అండగా నిలవడమే పోలీసుల నిజమైన సేవ అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.







