వినాయక చవితి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి రాజేంద్రనగర్ ఏసీపీ టి. శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గణపతికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి, అనంతరం స్వామివారికి హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏసీపీ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయకుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్, వేముల రామకృష్ణ, విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల శేఖర్, దండుగల శ్రీనివాస్, కొమేర శంకర్, గుంజ రాజు, గుంజా మధుసూదన్, మన్నె రాజు, దండుగల బాబుతో పాటు రాజేంద్రనగర్ వడ్డెర సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












