రాజకీయ పార్టీలలో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్య హోదా అంతంత మాత్రంగానే ఉందని, ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం చురుకుగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ ఆరోపించారు. రాజకీయ పార్టీలలో మాదిగలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
వివిధ రాజకీయ పార్టీలలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న మాదిగ సామాజిక వర్గ నాయకులకు, కార్యకర్తలకు తగిన రాజకీయ ప్రాతినిధ్య హోదా దక్కడం లేదని, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పార్టీలు మాదిగ రాజకీయ నాయకులపై వివక్ష చూపుతున్నాయని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపిన విషయం పత్రిక ప్రకటనల ద్వారా అందరికీ తెలిసినదే. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మాదిగ జనాభా సుమారు 12 వేల మంది ఉండగా, రాజకీయ పార్టీలు వారికి పార్టీలో ఇచ్చే పదవులు, ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీలో మాదిగలు కార్యకర్తలుగా పార్టీ జెండాలు మోస్తూ, గ్రామాల్లో నాయకుల కోసం ఎంత దూరమైనా వెళ్లి, నమ్మకంగా పార్టీ నాయకుల గెలుపు కోసం ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. తీరా గెలిచిన తరువాత నాయకులు, రాజకీయ పార్టీలు మాదిగ బిడ్డలను బానిస కార్యకర్తలుగానే చూస్తున్నాయని, నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా మాదిగలను ఎదగనీయడం లేదని అన్నారు.
ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగ జాతి బిడ్డలకు ఇచ్చే రాజకీయ ప్రాధాన్యత తక్కువేనని పేర్కొన్నారు. ఉదాహరణకు, కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ, మండల శాఖ కమిటీల నియామకం చేపట్టగా, అందులో కూడా మాదిగలకు ఇచ్చిన ప్రాధాన్యత తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి గతంలో మాల సామాజిక వర్గానికి ఇచ్చారని, మళ్ళీ నూతన కమిటీలో కూడా మాల సామాజిక వర్గానికే ఆ పదవిని కట్టబెట్టారని, అదేవిధంగా మండల కమిటీలో మాల సామాజిక వర్గ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మండలంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజిక వర్గ నాయకులకు చోటు దక్కలేదని అన్నారు.
మండలంలోని గ్రామాలలో గ్రామ కమిటీలు వేయగా, కేవలం ఒక్క గ్రామంలో మాత్రమే మాదిగ సామాజిక వర్గ నాయకునికి గ్రామశాఖ అధ్యక్ష పదవి దక్కిందని పేర్కొన్నారు. దీనితోపాటు, నిన్నటి రోజున కోనరావుపేట మండలంలోని రెండు పాక్స్ రైతు సంఘాలకు నూతన చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పదవులలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించగా, అందులో కూడా మాదిగ సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష ఏ రాజకీయ పార్టీలు మాదిగ నాయకులకు జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తమ జాతి బిడ్డలకు పదవులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా మాదిగ జాతి బిడ్డలారా ఆలోచన చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగ జాతి బిడ్డలమైన మనం, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉన్నామని తెలిపారు. వివిధ పార్టీల్లో బానిసలుగా ఉండటం కంటే, గౌరవ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ స్థాపించిన మహాజన సోషలిస్ట్ పార్టీలోకి రావాలని, మన తలరాతలు మనమే రాసుకొని రాజకీయంగా ఎదుగుదామని మాదిగ జాతి రాజకీయ నాయకులకు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ పిలుపునిచ్చారు.











