జిల్లా కేంద్రంలోని వాణీనగర్లో గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు వృందావన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
జిల్లా కేంద్రంలోని వాణీనగర్లో గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు వృందావన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, డీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్యలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ, వృందావన్ బాయ్స్ యూత్ సభ్యులు అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మానం అనంతరం అతిథులు చేతుల మీదుగా మహా అన్నదానం ప్రారంభించారు. ఈ అన్నదానంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృందావన్ బాయ్స్ యూత్ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.












