తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తదుపరి ఛైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస రామానుజం నియమితులవుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత టీటీడీ పాలకమండలి పదవీకాలం మరో నెల రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి ఛైర్మన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది.
శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రి నాయుడు. ఆయన జిల్లా వాసి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక, సామాజిక రంగాల్లోనూ ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సమక్షంలో దీక్ష స్వీకరించిన అనంతరం తన పేరును శ్రీనివాస రామానుజంగా మార్చుకున్నారని సమాచారం.
రాజకీయ నేపథ్యం
ఆయనకు ఆరెస్సెస్ భావజాలంతో అనుబంధం ఉందనే ప్రచారం కూడా ఉంది. బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంలోనూ శ్రీనివాస రామానుజం కీలక పాత్ర పోషించారని విశ్వసనీయ సమాచారం.
ఎన్నికలకు ముందు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన హోమం శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలోనే నిర్వహించారనే ప్రచారం ఉంది. అలాగే, అక్రమ కేసుల్లో చంద్రబాబు అరెస్టైన సమయంలో దిల్లీలోని బీజేపీ నేతలకు, టీడీపీకి మధ్య రాయబారిగా వ్యవహరించారనే చర్చ కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో వినిపించింది.
లక్ష్మీ శ్యామల రాజకీయ ప్రవేశం
శ్రీనివాస రామానుజం సతీమణి లక్ష్మీ శ్యామల కూడా గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావించినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఆమెకు ఉన్నప్పటికీ, అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఆమెకు అసెంబ్లీ టికెట్ కేటాయించలేకపోయిందని ప్రచారం జరిగింది. అయితే, అనంతరం ఆమెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అధిష్ఠానం నియమించింది.











