రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్భాటాలు, అవినీతి, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, కరువు కాలంలో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈఆర్సీ ద్వారా ప్రజలపై సుమారు 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విమర్శించారు.
కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్భాటాలు, అవినీతి, అబద్ధాలతో, అవగాహన రాహిత్యంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కరువు కాలంలో సాగునీరు, కరెంటు, సరైన యూరియా, రైతుబంధు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తే, నేడు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి రోజుకు వేల రూపాయలు ఖర్చు చేసి డీజిల్ పోసుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. పెట్టుబడి కోసం అప్పులు చేసి, పంటలు ఎండిపోయి రైతు నడిరోడ్డు మీద విలపిస్తుంటే ఈఆర్సీ () ద్వారా సుమారు 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బలవంతంగా ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి, 201 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టించుకుంటూ సామాన్యులను మోసం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బంది పెడితే, గతంలో బషీర్ బాగ్ వద్ద జరిగిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెంచిన బిల్లులను వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని ఆయన తెలియజేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, కనీసం సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు మంచినీళ్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించలేకపోయిందని విమర్శించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మంచినీళ్ల సరఫరాను నిలిపివేశారని తెలిపారు. కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం సచివాలయంలో ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని, 20 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.
గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న దళిత, బహుజన విద్యార్థులకు కనీస పౌష్టికాహారం అందడం లేదని, దీంతో వారు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి, విద్యార్థులకు ఏమాత్రం సరిపోని సైజుల్లో బూట్లు, యూనిఫామ్స్ అంటగడుతున్నారని మండిపడ్డారు. కోదాడ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది పిల్లలకు కనీసం వంటగది కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు వంటి పథకాలను ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు.
ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు, అబద్ధాలు, అవినీతితోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. కావున, హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, సామాన్యులకు ఏమాత్రం మేలు చేయని ఈ అనుభవరాహిత్య ప్రభుత్వానికి, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












