మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజం కార్తీక్ మాట్లాడుతూ, కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యార్థినులు బతుకమ్మను అందంగా పేర్చి, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు.
తెలంగాణ ఆడబిడ్డల రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను కళాశాలలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క ఆడబిడ్డకు, తెలంగాణ ప్రజలందరికీ ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజం కార్తీక్, మండల కన్వీనర్ ఎర్రవెల్లి అక్షయ, మండల సెక్రెటరీ చరణ్ తేజ, మండల వైస్ ప్రెసిడెంట్ ఎర్రవెల్లి శ్రీనిధి, జంగం శివాని, జాయింట్ సెక్రెటరీ భూక్య గంగాదేవి, నల్లమాసు శ్రీవల్లి, మండల గర్ల్స్ కన్వీనర్ బండి శివాని, మండల నారి శక్తి ఇన్చార్జి షేక్ ఉమేజా, మండల కార్యవర్గ సభ్యుడు నేరెళ్ల హర్ష, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.












