తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కూడా ప్రధానికి స్వాగతం పలికారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయ్, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ తదితరులు స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి పొరూర్ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం, సీఎం విజయ్‌తో కలిసి పూనమల్లి - వడపళని మధ్య నూతనంగా నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2ను ప్రారంభించారు.
మెట్రో ఫేజ్-2 ప్రారంభోత్సవం అనంతరం, ప్రధాని మోదీ, సీఎం విజయ్ ఇద్దరూ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ నూతన మెట్రో ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.13,000 కోట్లుగా అంచనా వేయబడింది.











