కొత్తపేట నుంచి కు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినా పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు కర్రెడ్ల నరేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షితమైన రహదారులు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని ఆయన ప్రశ్నించారు.
కొత్తపేట రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, రహదారి పరిస్థితి కారణంగా వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రైతులు ఎరువుల కొనుగోలు కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్లే ప్రధాన మార్గం ఇదేనని ఆయన గుర్తుచేశారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారిని అభివృద్ధి చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ఆయన నిలదీశారు.
గతంలో నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తే, ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు కనీసం ప్రయాణానికి అనువైన రహదారులను కూడా కల్పించలేకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రజల ఇబ్బందులను గుర్తించి, కొత్తపేట రహదారిని తక్షణమే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమస్యను ఇకనైనా పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, పాలకులకు ప్రజాశక్తి ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంచుకోట మహేష్, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి కల్వకోలు తిరుపతి, యువ నాయకుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.











