తల్లిదండ్రులకు దూరంగా ఉండి, వారిని వదలలేక తల్లడిల్లిన చిన్నారి దృశ్యాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను చలించిపోయేలా చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో, రెండు నెలలుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి బిడ్డను అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది. జిల్లా కలెక్టర్ చొరవతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
తల్లిదండ్రులకు దూరంగా ఉండి, వారు కలిసి వెళ్ళడానికి వస్తే వారిని వదలలేక తల్లడిల్లిన బిడ్డ దృశ్యాలు చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలు చలించిపోయారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లిన వీడియోపై నిన్న అంత చర్చ కొనసాగింది. అందరూ బిడ్డను వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలని కోరుకున్నారు.
అధికారులు సైతం ఆ వీడియోను చూసి చలించిపోయారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, బిడ్డను తల్లిదండ్రులకు వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లుగానే అప్పగించారు. ఇది సోషల్ మీడియా సాధించిన నిఖార్సైన విజయం.
అమ్మ ఒడికి చేరిన చిన్నారి. రెండు నెలల కన్నీళ్లకు, తల్లిదండ్రుల నిరీక్షణకు ముగింపు. మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ, దత్తత వివాదంతో దూరం అయింది. హైకోర్టు ఆదేశాలున్నా, అధికారుల జాప్యంతో కొనసాగిన చిన్నారి అప్పగింత వ్యవహారం.
అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లు అంటూ చిన్నారి కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్ధరాత్రి కరీంనగర్ శిశు సంక్షేమ గృహం నుంచి తల్లిదండ్రులకు అప్పగింత జరిగింది. రెండు నెలల తర్వాత ఇంటికి చేరిన చిన్నారితో కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.
న్యాయపోరాటంలో అండగా నిలిచిన అడ్వకేట్ రఘునందన్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.












