అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం 5,000 పోస్టులకు తగ్గకుండా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి భర్తీ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మహిళా సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న గిద్దె రాజేష్, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను నెలకు రూ.6,000కు పెంచుతామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి భర్తీ చేస్తామని, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేస్తామని, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని 29వ అంశంలో హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నప్పటికీ వికలాంగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదని ఆయన విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం వికలాంగులను ఎందుకు విస్మరిస్తోందని ఆయన ప్రశ్నించారు.
వెంటనే వికలాంగులకు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రతి జిల్లాలో కనీసం 5,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేలా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అర్హులైన వికలాంగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చట్టబద్ధమైన రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, వికలాంగుడైన వ్యక్తినే వికలాంగుల కమిషనర్గా నియమించాలని, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచే వికలాంగులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని, కొడంగల్లో ముఖ్యమంత్రికి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేసి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమాన్ని విస్తరిస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పలు దివ్యంగా సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












