Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 16
మధిర మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధిని విస్మరించి, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మున్సిపల్ పాలకవర్గాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ఓటేసి గెలిపించిన కౌన్సిలర్లు, చైర్మన్ అధికారాలను తగ్గించి, రాజ్యాంగేతర శక్తులతో సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఇది మున్సిపల్ చట్టమా లేక రాజ్యాంగేతర చట్టమా అని ఆయన ప్రశ్నించారు. 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికైన కౌన్సిల్, చైర్మన్‌కే పూర్తి అధికారాలు ఉంటాయని పల్లపోతు వెంకటేశ్వరరావు గుర్తుచేశారు. ఒకవైపు బయట డెవలప్ మెంట్ కమిటీ, మరోవైపు మున్సిపాలిటీ లోపల స్టాండింగ్ కమిటీ అని చట్టంలో లేని వ్యవస్థలను ఏ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారో అధికార పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీని మున్సిపల్ చట్టం ప్రకారం నడిపిస్తున్నారా లేక చట్టాన్నే మార్చేసేలా కాంగ్రెస్ పార్టీ సొంత చట్టాన్ని అమలు చేస్తున్నారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనూ లేని ఈ కొత్త విధానాన్ని కేవలం మధిరలోనే తీసుకురావడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో గందరగోళం సృష్టించేలా స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం సూచించినట్లు మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించి, సభ్యులను చేతులెత్తి ఆమోదం తెలపమనడం పూర్తిగా చట్టవిరుద్ధమని వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇలాంటి కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ గందరగోళంలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తలెత్తి వార్డుల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత పదేళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ కమిటీల పేరుతో స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన కౌన్సిల్ ద్వారానే పారదర్శక పాలన సాగిందని ఆయన గుర్తుచేశారు.
సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీని చీల్చే ఆలోచనను, కమిటీల సాకుతో కాలయాపన చేసే తీరును విరమించుకుని, మధిర పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.






