భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నౌకాదళం కోసం 8 అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ కార్వెట్ యుద్ధనౌకల నిర్మాణానికి రూ.40,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ ఎనిమిది యుద్ధనౌకల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలపై త్వరలో సంతకాలు చేయనున్నారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. వీటిలో ఐదు యుద్ధనౌకలను, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ మూడు యుద్ధనౌకలను నిర్మించనున్నాయి.
యుద్ధనౌకల ప్రత్యేకతలు
ఈ నెక్స్ట్ జనరేషన్ కార్వెట్ యుద్ధనౌకలు సుమారు 2,000 టన్నుల బరువు కలిగి ఉంటాయి. గంటకు సుమారు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలవు. భారత నౌకాదళం స్వయంగా రూపొందించిన సరికొత్త స్వదేశీ డిజైన్ ఆధారంగా వీటిని నిర్మించనున్నారు. అత్యాధునిక నౌకా నిర్మాణ సాంకేతికతను వీటిలో ఉపయోగించనున్నారు.
తొలి నౌక 2030 నాటికి
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఎనిమిది యుద్ధనౌకల్లో తొలి నౌకను 2030 నాటికి భారత నౌకాదళానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రక్షణ కార్యకలాపాలు
ఈ అత్యాధునిక యుద్ధనౌకలను పలు కీలక రక్షణ కార్యకలాపాలకు వినియోగించనున్నారు. సముద్ర ప్రాంతాల్లో నిఘా నిర్వహించడం, ఇతర నౌకలకు రక్షణ కల్పించడం, శత్రు నౌకలపై దాడులు చేయడం, సముద్ర తీర ప్రాంతాల భద్రతను పర్యవేక్షించడం, శత్రు జలాంతర్గాములు, వైమానిక ముప్పులను ఎదుర్కోవడం, సముద్రంలో శోధన, దాడి కార్యకలాపాలు నిర్వహించడం వంటివి వీటిలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీకి మరింత ప్రోత్సాహం లభించనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యం, సముద్ర భద్రత మరింత బలోపేతం కానున్నాయి.











