ఖమ్మం, 2026-08-26
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు ఖమ్మం మొదటి ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ తీర్పును వెల్లడించారని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితులకు భారీ జరిమానా కూడా విధించింది.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు ఖమ్మం మొదటి ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ తీర్పును వెల్లడించారని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితులకు భారీ జరిమానా కూడా విధించింది.
కేసు వివరాలు
చింతకాని మండలంలో 2022 నవంబర్ 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ చిన్నారిని, ఎదురింట్లో నివాసముంటున్న పాలకుర్తి శ్రీవర్ధన్ అనే యువకుడు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులైన సిమ్మసార్తి నాగరాజు, పాలకుర్తి వీరన్నలతో కలిసి బాలికపై బెదిరింపులకు దిగి లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని బాధితురాలిని బెదిరించారు.
పోలీసుల దర్యాప్తు
దీనిపై బాధితురాలి తల్లి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో చింతకాని పోలీసులు క్రైం నెంబర్ 152/2023తో ఐపీసీ సెక్షన్లు 376, 324, 506 / 34 తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి వైరా ఏసీపీ ఎం.ఏ. రహమాన్ పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
న్యాయస్థానం తీర్పు
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. శరత్ కుమార్ రెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో ఎ1 పాలకుర్తి శ్రీవర్ధన్ (19), ఎ2 సిమ్మసార్తి నాగరాజు (20), ఎ3 పాలకుర్తి వీరన్న అలియాస్ అభి (20)లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనితో పాటు ఎ1కు రూ. 65,000, ఎ2 మరియు ఎ3లకు చెరో రూ. 60,000 చొప్పున జరిమానా విధించింది.
పోలీసు సిబ్బందికి అభినందనలు
ఈ కేసులో పక్కాగా దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఏసీపీ రహమాన్, చింతకాని ఎస్ఐ జి. నరేష్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె. శ్రీనివాసరావు, లైజన్ ఎస్సై శ్రీకాంత్, హెచ్‌సీలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, నాగేశ్వరావు, హోంగార్డులు అయూబ్, చిట్టిబాబులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.
బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేసిన పోలీస్ బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తీర్పు పోక్సో చట్టం అమలులో పోలీసుల నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది.












