మొయినాబాద్ (ధర్మ రథం) సెప్టెంబర్ 15
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు కోడెలను రాజన్న ప్రసాదంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు కోడెలను అందజేశారు. కోరిన కోరికలు తీర్చే రాజన్నకు కోడె మొక్కు చెల్లించడం విశిష్ట సంప్రదాయమని, నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు కోడెలను అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
రైతులకు రాజన్న ప్రసాదంగా కోడెలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై పలువురు రైతులకు కోడెలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే తండ్రిగా భక్తుల విశ్వాసాన్ని పొందిన రాజన్నకు కోడె మొక్కు చెల్లించడం విశిష్టమైన సంప్రదాయమన్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థలకు కోడెలను అందించే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ నేపథ్యంలో నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు అందించాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత పద్ధతిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నట్లు వివరించారు.
రైతులు రాజన్న ప్రసాదంగా భావించి, తమ బిడ్డలను ఎలా చూసుకుంటారో అలాగే కోడెలను సంరక్షించాలని కోరారు. కోడెల సంరక్షణపై దేవాదాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. కోడెలను అక్రమంగా తరలించడం లేదా ఇతర మార్గాల్లో వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు పాలు మరువని కోడెలను ఇవ్వకూడదని ప్రభుత్వ విప్ విజ్ఞప్తి చేశారు. చిన్న కోడెలను దూర ప్రాంతాల నుంచి తరలించడం, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే జెర్సీ జాతి కోడెలు కూడా ఇవ్వద్దని సూచించారు. ఎదిగిన, ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు.
కోడెలకు ఆరోగ్య సమస్యలు రాకుండా టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన పోషకాహారం, దాణా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
శ్రావణ మాసంలోని ఒక సోమవారం రోజున తొలిసారిగా 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయని, స్వామివారికి వివిధ మొక్కుల టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. రాజన్నపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. రంగారెడ్డి జిల్లా మండలం ఎంకేపల్లి వద్ద అధునాతన గోశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో, అదే తరహాలో వేములవాడలోనూ గోశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వేములవాడ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. గోశాల పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి ప్రత్యేకంగా ఒక వెటర్నరీ వైద్యుడిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి దేవస్థానం ఈఓ, జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్చించి అధికారికంగా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. త్వరలోనే నియమిస్తామని వివరించారు. అనారోగ్యానికి గురైన కోడెలను దూరంగా ఉంచి అవసరమైన వైద్యం అందించేందుకు ఎకరం స్థలాన్ని వినియోగించనున్నట్లు వివరించారు. భక్తులు ఆలయంలో నిజ కోడెను సమర్పించే అవకాశం ఉందని, ఆలయ అధికారులను సంప్రదించి.. నిర్ణీత రుసుం చెల్లించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.












