ప్రజాస్వామ్యం (ధర్మ రథం) సెప్టెంబర్ 02
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడ్డాయి. ఇప్పటివరకు 13.37 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడగా, ఢిల్లీలో 32.8, తెలంగాణలో 21.7 ఓటర్ల పేర్లకు కోత పడింది. తొలగించబడిన ఓటర్లు తిరిగి తమ పేర్లను చేర్చుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి మాయమవుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13.37 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఇది సర్కు ముందు ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 14.1 శాతం. ముఖ్యంగా ఢిల్లీలో 32.8 శాతం, తెలంగాణలో 21.7 శాతం ఓటర్ల పేర్లకు కోత పడటం ఆందోళన కలిగిస్తోంది. తొలగించబడిన ఓటర్లు తిరిగి తమ పేర్లను చేర్చుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో ఓటర్లను కొత్తగా ధృవీకరించే పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రతి నమోదైన ఓటరు నిర్దేశిత కాలంలో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి. అంతేకాకుండా గతంలో జరిగిన చివరి సర్ సమయంలోని ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రుల పేర్లతో తమను తాము మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతను నిరూపించేందుకు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఓటు హక్కు పొందేందుకు ఇప్పటికే నమోదై ఉన్న పౌరుడే మళ్లీ తన అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందనేది అసలు ప్రశ్న. పేరు తొలగించడం సులభంగా జరిగి, తిరిగి చేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం పౌరుడిపైనే పడితే.. పేదలు, వలస కార్మికులు, వృద్ధులు, నిరక్షరాస్యులు, పత్రాలు సరిగా లేని కుటుంబాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరి పేరు లేదు
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. సర్కు ముందు 1.45 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. డ్రాఫ్ట్ రోల్లో వారి సంఖ్య 97.53 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 47.7 లక్షల మంది పేర్లు ఓటరు జాబితాలో లేవు. తొలగింపుల్లో 29.86 శాతం మంది గైర్హాజరు, వలస వెళ్లినవారు, ఇతర కారణాల కింద ఉన్నారు. మొత్తంగా 32.8 శాతం ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించబడ్డాయి. దేశ రాజధానిలోనే ఇంత భారీ స్థాయిలో ఓటర్ల జాబితా మారడం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తెలంగాణలో 21.7 శాతం కోత
సర్ ప్రభావం తెలంగాణపైనా గణనీయంగానే పడింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం తెలంగాణలో 21.7 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. అంటే ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి పేరు డ్రాఫ్ట్ జాబితాలో లేదన్నమాట.
మహారాష్ట్రలోనూ కోట్లల్లో పేర్లు తొలగింపు
మహారాష్ట్రలో సర్కు ముందు 9.78 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. డ్రాఫ్ట్ జాబితాలో ఆ సంఖ్య 7.71 కోట్లకు పడిపోయింది. అంటే సుమారు 2.07 కోట్ల మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేవు. మహారాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 3.56 శాతం మంది మరణించినవారిగా, 15.78 శాతం మంది శాశ్వతంగా వలస వెళ్లిన, గైర్హాజరు లేదా ఇతర కేటగిరీలుగా, 1.81 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారిగా గుర్తించబడ్డారు. మొత్తంగా 21.1 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గింది.










