జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 1.22 కోట్ల రూపాయలకు పైగా విలువైన చెక్కులను అందజేశారు.
జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 88 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 29 లక్షల రూపాయల విలువైన చెక్కులను, 93 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకం కింద 93 లక్షల 5 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాలకు మంజూరు అయ్యాయని, హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరి అని, రానున్న రోజుల్లో డంపింగ్ యార్డుల సమస్య తీవ్రం కానుందని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మెదడు సంబంధిత వ్యాధులను త్వరితగతిన గుర్తించవచ్చని, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో జగిత్యాలకు 12 కోట్ల రూపాయలకు పైగా సీఎం సహాయ నిధి నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పాక్స్ చైర్మన్లు దామోదర్ రావు, సందీప్ రావు, మాజీ జడ్పీటీసీలు ముస్కు ఎల్లా రెడ్డి, పెండెం రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, జిల్లా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొలీశెట్టి గంగారెడి, కట్ట రాజేందర్, ఎంఆర్ఓలు హకీమ్, రామ్మోహన్, ఆర్ఐలు భూమయ్య, నరేందర్, సర్పంచులు, ఉప సర్పంచులు, పట్టణ, మండల నాయకులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.











