తల్లి నిస్సహాయతతో హుస్సేన్ సాగర్లోకి నెట్టేసిన ఆరేళ్ల చిన్నారిని, ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్లను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ అభినందించి, సత్కరించారు. నేటి సమాజంలో మానవత్వానికి వీరు నిదర్శనమని సీపీ ప్రశంసించారు.
తల్లి నిస్సహాయతతో ఆరేళ్ల చిన్నారిని హుస్సేన్ సాగర్లోకి నెట్టేసి, మృత్యువుకు అప్పగించాలని చూసిన తరుణంలో.. ఏమాత్రం ఆలోచించకుండా, ప్రాణాలకు తెగించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్లను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించారు.
ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి, మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి కాలంలో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం. క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్ అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు సీపీ సూచనలు
పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని సీపీ సజ్జనార్ అన్నారు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయాలు తీసుకోకూడదని, నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరాలని సూచించారు. ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుందని, లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని ఆయన తెలిపారు.











